శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
జీవకిరీటము పొందును.
కిరీటము అనే పదము రాజరిక రంగము కన్నా క్రీడా రంగము నుండి వస్తుంది. అది విజయానికి ప్రతీక. దేవుడు మెచ్చిన విధముగా శ్రమలను సహించువారికి దేవుడు శాశ్వత బహుమానము ఇస్తాడు.
ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.౹ 20నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు. ” (1 థెస్స 2:19-20).
ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. (2 తిమో 4:8).
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. (1 పేతురు 5:4).
ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను (ప్రకటన 2:10).
తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన
వాగ్ధానము అనగా దేవుడు బాహాటముగా ప్రకటించి, నిశ్చయముగా తాను చేసేదనని చెప్పినది నెరవేర్చడం. ఆయన ఇచ్చిన మాటను మనము నమ్మవచ్చును. ఆయన వాగ్దానములనుబట్టి ఆయనను పట్టుకోవచ్చు.
నియమము:
తన వాగ్ధానములను దేవుడు తన యదార్ధతను బట్టి నెరవేరుస్తాడు.
అన్వయము:
ఏ సందేహము లేకుండా దేవుడు తన వాగ్ధానములను నెరవేరుస్తాడు గనుక, మనము తన మాటను నమ్మవచ్చును. ఆయన వాగ్దానములను బట్టి ఆయనను గట్టిగా పట్టికొనవచ్చును.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడుఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యా 23:19).
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. (రోమా 1:1-2).
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. (2 కొరిం 1:20).
నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? (యాకోబు 2:5).