మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
అతడు దేవుని అడుగవలెను,
అడుగుట అనగా విన్నవించుట, మనవిచేయుట, బతిమాలుట. అత్యవసరముగా అభ్యర్ధన చేయుట అను పదజాలము. ఈ మాటను క్రొత్తనిబంధన ప్రత్యేకంగా వ్యక్తిగత విన్నపములకు సందర్బోచితంగా ఉపయోగిస్తుంది. క్రిందిస్థాయిలో ఉన్న వ్యక్తి చేసే విన్నపము విజ్ఞాపనము.
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును. (మత్తయి 7:7).
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. (ఫిలిప్పీ 4:6-7).
మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. (యాకోబు 4:2-3).
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. (1 యోహాను 5:15).
నియమము:
దేవుని మీద మనము ఆధారపడుతున్నామో లేదో అనుటకు ప్రార్ధన ఒక మంచి సూచన.
అన్వయము:
తన జీవితములో పరిస్తితులను ఎదుర్కొను అసమర్ధతను గుర్తించూ క్రైస్తవుడు, దేవుని జ్ఞానమును వెదకుతాడు. ప్రార్ధన, దేవునికి తెలియని విషయానిగూర్చి సమాచారము అందించదు, కానీ ఆయన మీద ఆధారపడే ఒక చర్య.
మన వచనము “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడుకళాశాలకు వెళ్లవలెను” అని అనట్లేదు. విధ్య తెలివినిస్తుంది కాని తెలివిని వాడుకునే జ్ఞానాన్ని కలిగించదు. ఈ జ్ఞానము దేవుని వద్ద నుండి మాత్రమే వస్తుంది.
1 థెస్స 5:17 లో దేవుడు అడుగుటను ప్రార్ధన జీవితంలో భాగముగా ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే అడుగుట అంటే ఆధారపడుట. ఇది సలహా కాదు. ప్రార్ధనకు ప్రత్యాన్నయంలేదు. మన శక్తికిమించి కస్టము శ్రమను ఎదుర్కుంటే సమస్యను ఎదుర్కొడానికి జ్ఞానము పొందుటకు మనకుమనముగా దేవుని పాదాలమీద పడాలి.